మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శనివారం రాత్రి అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కరకట్టపై వీధిదీపాలు వెలగక చిమ్మచీకట్లు అలుముకున్నారు. 

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వున్న నారా చంద్రబాబు నాయుడు భద్రతపై టిడిపి నాయకులు గతకొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాడేపల్లిలో చంద్రబాబు కుటుంబం నివాసముండే ఇంటిపైకి వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచరులతో కలిసి దాడికి యత్నించాడు. అలాగే గతేడాది భారీ వర్షాల సమయంలో కృష్ణా నదిలో నీటిమట్టం పెంచి చంద్రబాబు నివాసాన్ని మునకకు గురిచేసే ప్రయత్నం చేసారని టిడిపి నాయకులు ఆరోపించారు. తాజాగా చంద్రబాబు నివాసం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం రాత్రి చంద్రబాబు నివాసం పరిసరాల్లో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. కరకట్టపై గత రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చంద్రబాబు నివాసంవద్ద కరకట్ట రహదారిపై లైట్లు వెలగకపోవడంతో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో అసలేం జరుగుతుందోనని టిడిపి నాయకులుఆందోళన వ్యక్తం చేసారు.

ఏపీలో విద్యుత్ కోతలు మరీ ఎక్కువయ్యాయని... ఏకంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంపై టిడిపి తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా ప్రతిపక్ష నేత నివాసం పరిసరాల్లో విద్యుత్ కోతలు విధించడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందని టిడిపి ఆరోపిస్తోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నివాసం వద్దే పరిస్థితి ఇలా వుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Video

ఇదిలావుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. అయితే తమ నాయకుడు చద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి రక్షణగా టిడిపి శ్రేణులు నిలిచారు. జోగి రమేష్ చంద్రబాబు ఇంటివైపు రాకుండా టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 

ఆగ్రహానికి గురయిన టిడిపి కార్యకర్తలు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ పై దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే జోగి రమేశ్, వైసీపీ నేతలు బాబు నివాసం వద్దకు భారీ కాన్వాయ్‌తో వస్తున్న వీడియోలను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. అయితే చంద్రబాబుతో మాట్లాడడానికి మాత్రమే జోగి రమేష్ వెళ్లారని పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. కానీ దాడి చేయడానికే ఆయన అనుచరులతో వచ్చినట్లు టిడిపి నాయకులు ఆరోపించారు.

ఇక గత వర్షాకాలంలో భారీ వర్షాలకకు ప్రకాశం బ్యారేజీలోకి వరద నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం సమీపంలోకి వరద నీరు చేరుకుంది. ఆయన నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలి ప్యాడ్ కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయాయి. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబి తోట, అరటి తోటలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇంటిలోనికి వరద నీరు చేరుకుండా సిబ్బంది సహాయంతో 10ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేసారు. రివర్ ఫ్రంట్ వ్యూభవనం, వాక్ వే కూడా నీట మునిగిపోయాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టింది. 

అయితే వైసిపి ప్రభుత్వమే ప్రకాశం బ్యారేజీలో నీటి ప్రవాహాన్ని పెంచి చంద్రబాబు నివాసాన్ని మునకకు గురిచేసే ప్రయత్నం చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రబాబు భద్రతలు ముప్పు కలిగించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టిడిపి నేతలే ఆందోళన వ్యక్తం చేసారు.