పూరి గుడిసెలో కేవలం ఒకే ఒక బల్బు ఉపయోగించినందుకు పేద కుటుంబానికి వేలల్లో కరెంట్ బిల్లు వచ్చింది.  

నూజివీడు : వారు నిరుపేదలు... రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి. ఇంతకాలం పూరి గుడిసెల్లో గుడ్డిదీపాల వెలుగులో బ్రతికిన వారు ఇప్పుడిప్పుడే విద్యుత్ దీపాల వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ విధానాలతో వాళ్లకు మళ్లీ గుడ్డిదీపాలకే దిక్కయ్యేలా వున్నాయని ప్రతిపక్ష టిడిపి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా వేలకు వేలు కరెంట్ బిల్లులు వస్తున్నాయని... దీంతో పేదప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని టిడిపి ఆరోపిస్తోంది. ఇలా ఓ పూరిగుడిసెలో కేవలం ఒకేఒక బల్బుకు వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిన విషయాన్ని టిడిపి నాయకులు బయటపెట్టారు. 

ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన పల్లపోతు జమలమ్మ కుటుంబంతో కలిసి ఓ పూరిగుడిసెలో నివాసముంటోంది. గుడిసెలో వెలుతురు కోసం కేవలం ఒకే ఒక విద్యుత్ బల్బును ఉపయోగిస్తున్నారు. ఏసీలు, ప్రిజ్ లు, కూలర్లు కాదు కనీసం ఫ్యాన్ కూడా ఉపయోగించే పరిస్థితి ఆ గుడిసెలో లేదు. కానీ ఆ గుడిసెకు వచ్చిన కరెంట్ బిల్లు చూసి జమలమ్మ కుటుంబం షాక్ కు గురయ్యింది. 

వీడియో

కేవలం ఒకేఒక బల్బు... అది కూడా రాత్రుళ్లే ఉపయోగిస్తామని జమలమ్మ కుటుంబం తెలిపింది. కానీ కరెంట్ బిల్లు మాత్రం రూ.2305 వచ్చిందని వాపోయారు. ఈ విషయం తెలిసి టిడిపి నేతలు జమలమ్మ గుడిసెవద్దకు చేరుకుని విద్యుత్ బిల్లును పరిశీలించారు. 

ఈ సందర్భంగా టిడిపి నేత యనమదల సత్యనారాయణ మాట్లాడుతూ... పేదల నడ్డివిరిచేలా జగన్ ప్రభుత్వ పాలన వుందని అన్నారు. నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ ఇంతటి భారీ జరిమానాలు విధిస్తారా? అని ప్రశ్నించారు. వైసిపి పాలనలో పేదలు బ్రతికే పరిస్థితి లేదని అర్థమయ్యిందని... వారిని ఆదుకునే బాధ్యత అధికారంలోకి వచ్చాక టిడిపి తీసుకుంటుందని సత్యనారాయణ అన్నారు.