ముగిసిన తిరుపతి ఉపఎన్నిక : ఆసక్తి చూపని ఓటరు, 5 గంటల నాటికి 55 శాతం పోలింగ్

ఏపీలోని తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. చివరి గంట కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకుంటారు.

Polling begins for Tirupati bypoll today

చెదురుమదురు ఘటనలు మినహా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. అయితే ఓటరు పోలింగ్  కేంద్రానికి రావడానికి అంతగా మొగ్గు చూపలేదు. సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదయింది.

సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. 7 గంటల వరకు క్యూలో వున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. 

సాయంత్రం 3 గంటల వరకు తిరుపతి లోకసభ ఎన్నికలో 47.42 శాతం ఓట్లు పోలయ్యాయి. వైసీపీ దొంగ ఓట్లు వేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతోంది.

తిరుపతి ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతిలో క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో శనివారం ఉదయం 9 గంటల వరకు 7.8 శాతం ఓట్లు పోలయ్యాయి.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపి నేతలు ధర్నాకు దిగారు. బయటిప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల వాహనాన్ని అడ్డుకున్నారు. వారంతా చౌడేపల్లి నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. దొంగ ఓట్లు వేసేందుకే వీరంతా వచ్చారని, స్థానికేతరులను పోలీసులు పంపించాలని డిమాండ్‌ చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట వాహనాలను అడ్డంగా ఉంచి ధర్నాకు దిగారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మన్న సముద్రం గ్రామంలో వైసీపి అభ్యర్థి మద్దల గురుమూర్తి తన ఓటు హక్కు  వినియోగించుకున్నారు. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక పోలింగులో విషాద సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించాడు. అరవపాలెంలో టీచర్ రవి మరణించాడు.  బుచ్చినాయుడి కండ్రిగంలో, సూళ్రూలుపేట 241 పోలింగ్ బూత్ లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి లేఖ రాశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగ ఓట్లు వేయబోతోందని ఆయన ఆ లేఖలో ఆయన ఆరోపించారు. మరణించినవారి, గ్రామాల్లో లేనివారు ఓట్లు వేయడానికి వైసీపీ పూనుకుంటోందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. చివరి గంట కరోనా రోగులకు కేటాయించారు కరోనా వైరస్ బాధితులను సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఓటు వేయడానికి అనుమతిస్తారు. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 17,11,195 మంది ఓటర్లు ఉన్నారు. లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బిజెపి, జనసేన కూటమి నుంచి రత్నప్రభ పోటీ పడుతున్నారు. 

తిరుపతి లోకసభ సీటు పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు 10,850 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 23 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మూడు కంపెనీల ప్రత్యేక బలగాలు తిరుపతి లోకసభ పరిధిలో మోహరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాయి. 

తొలిసారి 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 508 మంది, దివ్యాంగులు 284 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios