పెద్దాపురంలో పొలిటికల్ హీట్.. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు.. లై డిటెక్టర్ టెస్టుకు సై అంటే సై..
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి కొనసాగుతుంది.

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి కొనసాగుతుంది. ఇరువర్గాలు లై డిటెక్టర్ టెస్టుకు సై అంటే సై అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దొరబాబుల మధ్య కొంతకాలంగా మాటల యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడంతో పాటు.. పలు ఆరోపణలు సంధించుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ది జరిగిందంటే.. కాదు తమ ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగిందంటూ బహిరంగ సవాళ్లకు దిగారు.
దొరబాబుకు అభివృద్ది చేయాలనే ఆలోచన లేదని.. అభివద్ది పనులకు అడ్డుపడుతున్నారని నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అక్రమ మైనింగ్, మట్టి మాఫియాకు, గ్రావెల్ తవ్వకాలకు దొరబాబు అండగా ఉంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే దొరబాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎవరి ప్రభుత్వంలో అవినీతి జరిగిందో బహిరంగ చర్చకు సిద్దమని దొరబాబు ప్రకటించారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో ఇద్దరం లై డిటెక్టర్ టెస్టు చేయించుకుంటే.. ఎవరూ చెబుతుంది వాస్తవమనేది ప్రజలు తెలుస్తుందని చినరాజప్పకు సవాలు విసిరారు. తన నిజాయితీ రుజువు కాకపోతే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. మరోవైపు లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దమని చినరాజప్ప ప్రకటించారు.
ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పెద్దాపురంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇరువురు నేతలు కూడా పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో లై డిటెక్టర్ టెస్టులకు సిద్దమయ్యారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను కూడా మోహరించారు. అధికార, విపక్ష పార్టీలు పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ స్థానికంగా నెలకొంది.