ఏకంగా పోలీస్ స్టేషన్లో నిలిపిన పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లాడు ఓ ఘరానా దొంగ. ఈ ఘటన  చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

చిత్తూరు : ఏదయినా దొంగతనం జరిగితే మనం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే పరిస్థితి ఏంటి. ఇలాంటి పరిస్థితే చిత్తూరు పోలీసులకు ఎదురయ్యింది. ఓ ఘరానా దొంగ పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి చొరబడి ఏకంగా పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. 

వివరాల్లోకి వెళితే... చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రోజూ మాదిరిగానే సోమవారం కూడా రక్షక్ వాహనాన్ని నిలిపారు. తాళం కూడా వేయకుండానే నిలిపివుంచిన ఆ వాహనంపై ఓ దొంగ కన్నుపడింది. పోలీస్ స్టేషన్ లోకి దర్జాగా వెళ్ళిన దొంగ దాదాపు అరగంటపాటు ఆ పరిసరాల్లోనే తచ్చాడాడు. అదును చూసుకుని పోలీస్ వాహనాన్ని స్టార్ట్ చేసుకుని పరారయ్యాడు. 

పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నిలిపిన వాహనం కనిపించకపోవడంతో పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించారు. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన పట్టణంలోని సిసి కెమెరాలను కూడా పరిశీలించారు. దీంతో వాాహనాన్ని తీసుకుని దొంగ తమిళనాడువైపు వెళ్లినట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.

Read More వార్నీ.. తప్పతాగి రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. రైలు దిగి నిద్రలో నుంచి లేపిన లోకో పైలట్

దిండివనం సమీపంలో ఏపీ పోలీస్ వాహనం వెళుతుండటాన్ని గుర్తించి తమిళ పోలీసులు అడ్డుకున్నారు. వాహనంతో సహా దొంగను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగిలించబడ్డ వాహనం గంటల వ్యవధిలోనే చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.