సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. 

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆడవారిలా బురఖాలు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా అతనిని నడిరోడ్డుపై నరికి చంపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా ఛేదించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వీరిని ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్ కుమార్, హరిబాబు, సుబ్బయ్య, రాణిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. భూ వివాదాలతోనే ఈ హత్య జరిగిందని.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని అన్భురాజన్ పేర్కొన్నారు. 

మృతుడు శ్రీనివాస్ రెడ్డికి.. ప్రధాన నిందితుడు ప్రతాప్ రెడ్డికి మధ్య ఓ భూ వివాదంలో విభేదాలు వచ్చాయని ఆయన చెప్పారు. ప్రతాప్ రెడ్డికి రూ.80 లక్షలు ఇవ్వాల్సి వుండగా.. శ్రీనివాసులు రూ.60 లక్షలే ఇచ్చాడని.. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న ప్రతాప్ రెడ్డి హత్యకు పథకం రచించినట్లు ఎస్పీ చెప్పారు. కేసులో కొందరిపై అనుమానాలు వున్నాయని, వారికి నోటీసులు చేశామని ఆయన తెలిపారు. గూగుల్ టేకౌట్ ద్వారా సాంకేతిక ఆధారాలు కూడా సేకరిస్తున్నామని.. ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. హత్య సమయంలో నిందితులకు కొడవలి అందకుండా చేసిన ఓ మహిళను పోలీస్ శాఖ తరపున సన్మానిస్తామని అన్భురాజన్ పేర్కొన్నారు.