విజయనగరం జిల్లా పినవేమలిలో యువకుడి హత్య కేసును పోలీసులు చేధించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వివరాలను బుధవారం ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. పినవేమలికి చెందిన కే.రవికుమార్ (26) ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే రవికుమార్ అదే నెల 19న నేల బావిలో శవమై తేలడంతో హత్య కేసుగా నమోదు చేశారు. ఊరి చివరున్న తోటలో పార్టీ చేసుకోవడమే కాకుండా.. అంతా కలిసి తిరుపతికి వెళ్లారని బాలి పైడిరాజు, వారి ముగ్గురు స్నేహితులపై పోలీసులకు అనుమానం రావడంతో దర్యాప్తు చేశారు.

పైడిరాజుకు గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె రవి కుమార్ తో కూడా చనువుగా ఉండేది. ఈ క్రమంలో తట్టుకోలేక రవి కుమార్ తో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు. చివరికి అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఫిబ్రవరి 17న సర్పంచ్ గెలుపు సంబరాలు చేసుకుంటున్న వేళ చంపితే ఎన్నికల హడావుడి లో చేసిందిగా అంతా అనుకుంటారని భావించాడు. పథకం ప్రకారం ఊరి చివర తోటలో స్నేహితులతో మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. 

దీనికి కె. ఉదయ్ కిరణ్, జి. నారాయణ రావు, ఈ. సత్యనారాయణ, రవి కుమార్ లను పిలిచాడు, మద్యం మత్తులో ఉన్న రవికుమార్ మెడకు పైడిరాజు తాడును బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక మిగిలిన స్నేహితులకు చెప్పాడు.  దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అనడంతో చీరను తెచ్చి మెడకు బిగించి చెట్టుకు కట్టేశారు.

బరువు ఎక్కువ అవడంతో చెట్టు కొమ్మ విరిగింది. కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టేసి బావిలో పడేస్తే మృతదేహం పైకి తేలదని నారాయణరావు సలహా ఇవ్వడంతో అదే పని చేశారు. చివరకు విషయం తేలడంతో పోలీసులు హత్య గా నిర్ధారించుకున్నారు నిందితుడు పైడిరాజు తనే నేరం చేశానని, స్నేహితులు ముగ్గురు సహకరించారని వీఆర్వో ఎదుట లొంగిపోవడంతో పోలీసులు రిమాండ్ కు తరలించారు.