ప్రభుత్వానికి ప్రధానంగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఎవరు కూడా నోరు విప్పకూడదన్నట్లుగా ఉంది పోలీసులు వ్యవహారం. ఎంఎల్ఏ ఏమో సమస్యలను పట్టించుకోరు. అడగటానికి ఎవరికీ అందుబాటులో కూడా ఉండరు. ఆందోళన తెలుపుదామనుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు.

హిందుపురం పట్టణంలో పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా వైసీపీ ఈరోజు చేయాలనుకున్న మహాధర్నాను పోలీసులు అడ్డుకోవటంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇటీవలే మహిళలు భారీ ఎత్తున ప్రదర్శన చేయటం, అందులో బర్రెలపై ఎంఎల్ఏ బాలకృష్ణ పేరు రాసి ఊరేగించటం తదితరాలతో ప్రభుత్వం పరువుపోయింది. అందుకనే మహాధర్నాను అడ్డుకున్నారు.

పోయిన ఎన్నికల సమయంలో ఎంఎల్ఏగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ ఎన్నో హామీలు ఇచ్చారు. కూరగాయల మార్కెట్ నిర్మాణం, ఇంటింటికి మంచినీటి సౌకర్యం తదితరాలున్నాయి. అయితే, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతున్నా బాలకృష్ణ హామీలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో వైసీపీ నిరసనకు దిగింది. అందులో భాగంగానే ఈరోజు మహాధర్నాకు పిలుపునిచ్చింది. అందుకోసం జనాలు కూడా బాగానే జమయ్యారు. అయితే, పోలీసులు ఇక్కడే ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. నియోజకవర్గం ఇన్ ఛార్జ్ నవీన్ నిశ్చల్ ను ఇంటి నుండి బయటకు రానీయలేదు.

ఉదయం నుండే నవీన్ ఇంటిని పోలీసులు చుట్టిముట్టారు. బయటవాళ్ళని ఇంట్లోకి వెళ్ళనీయటం లేదు. అలాగే ఇంట్లో వాళ్లనీ బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దాంతో విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నవీన్ ఇంటి వద్దకు చేరుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు-వైసీపీ నేతలు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అంటే ప్రభుత్వానికి ప్రధానంగా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఎవరు కూడా నోరు విప్పకూడదన్నట్లుగా ఉంది పోలీసులు వ్యవహారం. ఎంఎల్ఏ ఏమో సమస్యలను పట్టించుకోరు. అడగటానికి ఎవరికీ అందుబాటులో కూడా ఉండరు. ఆందోళన తెలుపుదామనుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. హిందుపురంలో ‘రాజుగారి బావమరిది అంటే మజాకానా’.