ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను బుధవారం నాడు తుని వద్ద పోలీసులు అడ్డుకొన్నారు.
కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన నేపథ్యంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కాకినాడకు వెళ్తున్నపవన్ కళ్యాన్ కాన్వాయ్‌లో 10 వాహనాలను తునిలో అడ్డుకొన్నారు.
Also read:ద్వారంపూడి ఎఫెక్ట్: కాకినాడకు బయలుదేరిన పవన్, కఠినమైన ఆంక్షలు
కాకినాడకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకొంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడ భారీగా వైసీపీ శ్రేణులు చేరుకొన్నారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నెల 12వ తేదీన వైసీపీ కార్యకర్తల దాడిలో నానాజీ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నానాజీని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి నేరుగా కాకినాడకు బయలుదేరారు.
విశాఖపట్టణం నుండి రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ కాకినాడకు బయలుదేరారు. విశాఖ నుండి పవన్ కళ్యాణ్ వెంట ఆ పార్టీ నేతలు భారీగా బయలుదేరారు.ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లోని 10 వాహనాలను తుని వద్ద పోలీసులు అడ్డుకొన్నారు.
కాన్వాయ్ లోని 10 వాహనాలను అక్కడే నిలిపివేశారు. కానీ, పవన్ కళ్యాణ్ వాహనాన్ని మాత్రం అనుమతిచ్చారు.. మరో వైపు పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకొని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నానాజీ ఇంటి వద్దకు చేరుకోన్నారు. నానాజీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.
మరో వైపు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడ పోలీసులు, వైసీపీ కార్యకర్తలు మోహరించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో పాటు, నానాజీ ఇంటి పరిసర ప్రాంతాల్లో దుకాణాలను మూసివేయించారు పోలీసులు.
కాకినాడలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. రోడ్లపై జన సంచారం లేదు. నానాజీ, చంద్రశేఖర్ రెడ్డి ఇళ్ల వైపుకు వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.