టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో నర్సీపట్నం స్థానికంగా ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తల్లో అందోళన నెలకొని ఉంది. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు మధ్య విభేదాలు నెలకొని ఉన్నాయి. 

తన సోదరుడితో విభేదించడంతో సన్యాసి పాత్రుడు ఇటీవల వైసిపిలో చేరారు. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడు ఒకే భవనంలో నివాసం ఉంటున్నారు. సన్యాసి పాత్రుడు వైసిపిలో చేరిన తర్వాత ఆయన నివాసం ఉంటున్న భవనంపై వైసిపి జెండా ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది. 

దీనితో పోలీసులు అయ్యన్నపాత్రుడి నివాసానికి వెళ్లారు. అకారణంగా పోలీసులు రావడం ఏంటని ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. తమ విధులకు ఆటకం కలిగించారని కారణంతో పోలీసులు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేశారు. 

ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసే ఆలోచన లేదని పోలీస్ వర్గాల సమాచారం. ఈ కేసుపై దర్యాప్తు చేసి అరెస్ట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారట. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు వ్యక్తిగత పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లారు. 

పోలీసులు కేసు నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ తో సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. మొత్తంగా అయ్యన్నపాత్రుడి తమ్ముడి వివాదం టిడిపిలో పెద్ద చర్చకే దారి తీస్తోంది.