రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అరెస్టుకి రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

ఈ  ఆందోళన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముదస్తుగా రాపాక ముఖ్య అనుచరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త  వాతావరణ నెలకొంది.

ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై...ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ... ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది. మరికాసేపట్లో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.