ఒంగోలు: తనకు న్యాయం కావాలంటూ పోలీసు స్టేషన్ కు వచ్చిన ఓ మహిళను రైటర్ మోసం చేశాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న వెంకట రాజేష్ నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. 

చిన్న గొడవ విషయంలో పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళను వెంకట రాజేశ్ మాయమాటలతో నమ్మించి లోబరుచుకున్నాడు. ఆమెతో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దానికితోడు. ఆమె వద్ద రూ.35 లక్షలు తీసుకున్నాడు. దానికి ఖాళీ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. 

ఆ తర్వాత తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించాడు. బాధితురాలు నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు. వాటిని చూపించి బెదిరించడం ప్రారంభించాడు. తన స్థానాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రెండు నెలలు ఆమెను నిలువరించాడు. 

తన స్నేహితుడు సుధాకర్ తో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బులు అడిగితే తన మిత్రులతో కలిసి చంపేస్తానని కూడా బెదిరించాడు. అతని వేధింపులను భరించలేక మహిళ డీఎస్పీ ప్రసాద్ ను ఆశ్రయించింది. 

ఆమె ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రాజేష్ ను, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ బాధ్యతను ఒంగోలు డిఎస్పీకి అప్పగించారు.