విశాఖపట్టణంలో చిన్నారి జ్ఞానస మృతదేహం బుధవారం నాడు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల తర్వాత చిన్నారి డెడ్‌బాడీ లభ్యమైంది.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని పెందుర్తికి సమీపంలోని ఎర్రగొండ (కాటమయ్య కొండ)పై చిన్నారి జ్ఞానస మృతదేహాన్ని పోలీసులు బుధవారం నాడు వెలికితీశారు.
విశాఖపట్టణంలోని పెందుర్తికి చెందిన కుసుమలత కుటుంబ కలహలతో ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానసను తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చింది. బంగారం కోసం భర్తతో గొడవకు దిగింది. ఆత్మహత్య చేసుకోవాలని పాపను తీసుకొని వెళ్లింది. ఆత్మహత్య చేసుకొనేందుకు గాను కుసుమలత ఎర్రగొండ (కాటమయ్య కొండ)పైకి వెళ్లింది.
ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో భాగంగా ఆమె తన గొంతు కోసుకొంది. అంతేకాదు రెండు ఉంగరాలను కూడ మింగింది. కానీ ఆమె చనిపోలేదు.. ఈ నెల 10వ తేదీన గొర్రెల కాపరులు కొండపై కుసుమలతను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో కొండపైనే మృతదేహాన్ని ఆమె పూడ్చిపెట్టింది.
మూడు రోజులుగా పోలీసులు, స్థానికులు కొండపై గాలింపు చర్యలు చేపట్టారు. కుసుమలత చెప్పిన ఆనవాళ్ల ప్రకారంగా కొండపై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొండపై చిన్నారిని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని కనిపెట్టలేకపోయారు.
బుధవారం నాడు మధ్యాహ్నం చిన్నారి మృతదేహన్ని కొండపై గుర్తించారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం పోలీసులు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.ఆకలితోనే చిన్నారి మృతి చెందినట్టుగా తల్లి కుసుమలత చెబుతున్నారు.
క్షణికావేశంలో కుసుమలత తీసుకొన్న నిర్ణయం కారణంగా చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మృతిచెందడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
