Asianet News TeluguAsianet News Telugu

పరిటాల సునీత దీక్ష భగ్నం.. ఇబ్బంది పెట్టినవారిని మర్చిపోమన్న మాజీ మంత్రి..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరహార దీక్షను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున భగ్నం చేశారు.

Police foil Paritala sunitha Deeksha over Chandrababu Arrest ksm
Author
First Published Sep 26, 2023, 10:19 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరహార దీక్షను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున భగ్నం చేశారు. వివరాలు.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అనంతపురం పరిధిలోని పాపంపేటలో సునీత ఆమరణ నిరసన దీక్షకు దిగారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సునీత దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు.. పరిటాల సునీతను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు తీరుపై పరిటాల సునీతతో పాటు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే చివరకు పరిటాల సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిటాల సునీతకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక, పలువురు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. 

అయితే ఈ క్రమంలోనే పరిటాల సునీత మాట్లాడుతూ.. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తాము ఆమరణ నిరహార దీక్ష చేపడితే.. జనాలు వస్తారనే భయంతో అతి దారుణంగా శిబిరంపై పడి దీక్షను భగ్నం చేశారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారని.. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. పైన ఉన్న నాయకుల ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా నిరసనగా చేపట్టామని.. తాము ఎవరికి ఇబ్బంది కలిగించలేదని అన్నారు. అలాంటి తమ దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు.

పోలీసులు కూడా ఆలోచించాలని.. ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబును, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టినవారిని మర్చిపోమని చెప్పారు. రాష్ట్రంలోని అందరి గురించే తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబును జైలులో పెట్టారని విమర్శించారు. సైకో సీఎం ఏది చెబితే పోలీసులు అది చేయడం సరికాదని అన్నారు. పోలీసులు వారి డ్యూటీ సరిగా చేయాలని కోరారు. తాము దీక్ష చేపట్టింది కూడా ప్రైవేట్ ల్యాండ్‌ అని చెప్పారు. అయినప్పటికీ ఈ విధంగా దీక్షను భగ్నం చేయడం దుర్మార్గమని.. తాను ఇక్కడే నిరసన కొనసాగిస్తానని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios