Asianet News TeluguAsianet News Telugu

సంకల్ప సిద్ది కేసు.. డైరెక్టర్ కిరణ్‌‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొనసాగుతున్న దర్యాప్తు..

సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో జనాలకు వందలకోట్లు టోకరా వేసిన కేసు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

Police Detain Sankalp Siddhi mart director
Author
First Published Dec 2, 2022, 1:10 PM IST

సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో జనాలకు వందలకోట్లు టోకరా వేసిన కేసు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సంకల్ప సిద్ధి డైరెక్టర్ కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు ఎండీ వేణుగోపాల్, అతని సోదరుడు కిషోర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు. నిందితుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిందని, కోట్లాది రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ‘‘నిర్వాహకులు 2021లో సంకల్ప్ మార్ట్‌ను స్థాపించారు. ఈ ఏడాది మే నెలలో సంకల్ప్ సిద్ధి ఈకార్ట్ ఇండియా ప్రై. లిమిటెడ్ స్థాపించారు. మనీ సర్క్యులేషన్ పథకం పేరుతో ఎంత మందిని మోసం చేశారో, ఎంత మొత్తం డబ్బులు వసూలు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని పోలీసులు చెప్పారు. 

నిందితులు కొద్దికాలంలోనే కోట్లాది రూపాయల డిపాజిట్లు ఎలా సేకరించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని డేటాను విశ్లేషించే పనిలో ఉన్నారు. ఇక, సంకల్ప సిద్ది మార్ట్ పేరుతో మూడు రాష్ట్రాల్లోని 2,000 మంది కస్టమర్ల నుంచి నిర్వాహకులు సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో తనకు సంబంధం ఉందని వస్తున్న ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం స్పందించారు. ఈ కేసు విషయంపై చర్చించేందుకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆయన కలిశారు. డీజీపీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సంకల్ప సిద్ధి కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. ఈ విషయమై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు, పట్టాభిలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి  ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు తనపై తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా  వంశీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios