ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే వాహనానికి ఎదురువెళ్లినందుకు ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. అతడి వేలును చితగ్గొట్టారు. 

ఒంగోలు : ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారని నెపంతో ఒక వ్యక్తిని police చితకబాదిన సంఘటన కలకలం రేపింది. Prakasam District సంతనూతలపాడు మండలం గంగవరంలో మంగళవారం ఇది చోటు చేసుకుంది. బొడ్డువారిపాలెం గ్రామంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి శాసనసభ్యులు టీజెఆర్ సుధాకర్ బాబు వెళ్తున్నారు. మార్గమధ్యంలో గంగవరం వద్ద రోడ్లు, కాలువల సమస్యలను చెప్పేందుకు ఏం రాఘవయ్య అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఆయన ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై అడ్డంగా పెట్టడంతో మండలపార్టీ అధ్యక్షుడు డీ. చెంచిరెడ్డి ఆగ్రహించి వాగ్వాదానికి దిగారు.

ఆయన అనుచరులు దుర్భాషలాడుతూ ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సంతనూతలపాడు ఎస్ఐ బి. శ్రీకాంత్, సిబ్బంది గ్రామానికి వచ్చి… ‘ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగిస్తావా?’ అంటూ స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టడంతో తన వేలు చిక్కిందని బాధితుడు రాఘవయ్య వెల్లడించారు. ‘ఎమ్మెల్యేకు సమస్యలు చెబుదామని వెడితే.. నేను అక్కడ ఉంటే చెంచిరెడ్డి దుర్భాషలాడి అనుచరులతో పక్కకు గెంటేయించారు. నన్ను స్టేషన్కు తీసుకు వెళ్లాలని కానిస్టేబుళ్లకు సూచించారు. ఆతర్వాత ఎస్ఐ సిబ్బంది కొట్టారు’ అని వాపోయారు.

ఈ సంఘటనపై ఎస్ఐ శ్రీకాంత్ వద్ద ప్రస్తావించగా గంగవరంలో రాఘవయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారని, దీనిపై ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి మందలించామని తెలిపారు. తాము అతడిని కొట్ట లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, గుంటూరులో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చిన్నారులు కొందరు సరదాగా ఆడుకుంటుండగా పొరపాటున ఆటవస్తువులు తగిలి.. అధికార వైసిపి ప్లెక్సీ చిరిగిపోయింది. దీంతో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ మెప్పుకోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కావాలనే ప్లేక్సీ చించారని చిన్నారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఓ పూట అక్కడే కూర్చోబెట్టారు. అయితే ప్రతిపక్ష టిడిపి నాయకులు వెంటనే స్పందించి వ్యక్తిగత పూచికత్తు మీద పిల్లలను విడిపించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానుపాడులో చోటుచేసుకుంది

ఇదిలా ఉండగా, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో బైటినుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ మీద దాడికి ప్రయత్నించిన ఘటనపై ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని చిట్వేల్ కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పదేళ్ల బాలుడు మరణించాడు. కాగా, డెడ్ బాడీని స్వగ్రామమైన చిట్వేల్ కు తీసుకువెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదించాడు. 90 కి,మీ. దూరంలో ఉన్న చిట్వేల్ కు వెళ్లేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. 

కొడుకు వైద్యం కోసం డబ్బులు లేకపోవడంతోనే రుయా ఆసుపత్రికి తీసుకొచ్చానని, అన్ని డబ్బులు ఇవ్వలేనని ఆ వ్యక్తి తెలిపాడు. ఆ తరువాత తనకు తెలిసిన వారికి సమాచారం ఇవ్వడంతో బయటి నుండి ఓ అంబులెన్స్ ను మాట్లాడి రుయా ఆసుపత్రికి పంపించారు. అయితే ఈ అంబులెన్స్ ను ఆసుపత్రిలోకి అంబులెన్స్ డ్రైవర్లు రానివ్వలేదు. అంబులెన్స్ డ్రైవర్ ను దూషించడమే కాకుండా కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అతను అంబులెన్స్ ను తీసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అంబులెన్స్ యజమాని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.