తిరుపతిలో భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ వార్నింగ్ ఇచ్చి 24 గంటల గడవక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎస్‌ఎల్‌వీ నగర్‌లోని 60 అంకణాల భూమి తనదేనంటూ ఓ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు.

ఇంటి తాళం పగులగొట్టి వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నరేశ్ కుమార్ అనే వ్యక్తిని బెదిరించాడు. అయితే ఆ ఇళ్లు తమకు చెల్లుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని బాధితుడు చెబుతున్నాడు.

అయినప్పటికీ కానిస్టేబుల్ వేధింపులకు దిగుతున్నాడని అతను వాపోతున్నాడు. దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెడుతున్నాడని, సదరు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు నరేశ్.

మరోవైపు తిరుపతి భూ వివాదాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. భూ వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిపిరి సీఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు వేశారు. సుబ్బారెడ్డి స్థానంలో తాడిపత్రి సీఐని నియమించారు.

తిరుపతిలో భూ ఉదంతాలపై స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. కబ్జా రాయుళ్లు ప్రైవేట్ ఆర్మీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వీటిపై స్పందించిన ఎస్పీ.. తిరుపతిలో గ్యాంగ్‌లు, ముఠాలకు చోటు లేదన్నారు. భూ వివాదంపై టింబర్ డిపో యజమాని రాము చేసిన ఫిర్యాదు మేరకు నిందితులు రమేశ్ రెడ్డి సహా పది మందిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరులమంటూ కొందరు కత్తులతో హల్‌చల్ చేసిన సంఘటన కలకలం రేపింది.