తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి కల్తీ కల్లు కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు అక్రమ సంబంధం కారణమని తేల్చారు పోలీసులు. రాంబాబు అనే వ్యక్తికి మృతుడు గంగరాజు భార్యతో అక్రమ సంబంధం వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

తూర్పుగోదావరి జిల్లాలో (east godavari district) సంచలనం సృష్టించిన కల్తీకల్లు కేసును పోలీసులు ఛేదించారు. రాజవొమ్మంగి మండలం (rajavommangi) లోదొడ్డిలో జీలుగ కల్లు తాగి ఇటీవల ఐదుగురు గిరిజనులు చనిపోయారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు దర్యాప్తు జరిపాయి. ఐదుగురి ఉసురు తీసిన జీలుగ కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. వీటిని కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పరీక్షల కోసం పంపారు. గిరిజనులు తాగిన కల్లులో క్రిమి సంహారకం కలిసినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా నమూనాలను పంపించారు. సాధారణంగా జీలుగ చెట్టు నుంచి తీసిన కల్లు తాగితే చనిపోయే అవకాశం లేదు. కానీ దీని వెనుక ఏదో జరిగిందన్న కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్లులో విషం కలిపారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలంలో లోదొడ్డి గ్రామం వుంది. గ్రామస్తులైన పొత్తూరి గంగరాజు , భూసాని సన్యాసిరావు , లోవరాజు, చెదల సుగ్రీవు, కూడె ఏసుబాబులు రోజులోగే ఓ రోజున తెల్లవారుజామున జీలుగ చెట్టు వద్దకు వచ్చి కల్లు తాగారు. గంట వ్యవధిలోనే వీరంతా నూరగలు కక్కుతూ ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు జెడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పాటు బాధితుల పరిస్ధితి అప్పటికే విషమంగా మారింది. దీంతో ఏలేశ్వరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.

లోవరాజు, సుగ్రీవు దారిలోనే చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గంగరాజు, సన్యాసిరావు, ఏసుబాబులు చనిపోయారు. ఓ గ్రామ వాలంటీర్‌కు మృతులతో గొడవలు వున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను జీలుగ కల్లులో విషం కలిపి వుంటారని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కల్లు కుండ నుంచి క్రిమి సంహారక మందు వాసన వస్తోంది. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే కల్లులో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. ఘటనకు అక్రమ సంబంధం కారణమని తేల్చారు పోలీసులు. రాంబాబు అనే వ్యక్తికి మృతుడు గంగరాజు భార్యతో అక్రమ సంబంధం వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.