వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి శాసనసభ్యురాలు రోజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 143, 146, 341, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి శాసనసభ్యురాలు రోజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 143, 146, 341, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 27వ తేదీన జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి.... చిత్తూరు జిల్లా నగరి మండపం వద్ద రోడ్డు ప్రమాదంలో సుమతి అనే 45 ఏళ్ల వయస్సు గల మహిళ మరణించింది. నిండ్ర మండలం అగరంపేటకు చెందిన ఈమె, తన కుమారుడు ప్రతాప్‌తో కలసి ద్విచక్రవాహనంపై నగరి కోర్టు నుంచి తమ గ్రామా నికి బయలుదేరారు. 

మండపం వద్ద నగరినుంచి తిరుపతి వైపు కంకరతో వెళ్తున్న టిప్పర్‌ వారు ప్రయాణిస్తున్న బైకును ఢీకొంది. దీంతో సుమతి తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతాప్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆ సమయంలో దగ్గరిలోని డిగ్రీ కళాశాల మైదానంలో క్రీడా పోటీల్లో ఉన్న ఎమ్మెల్యే రోజాకు ప్రమాద సమాచారం తెలిసింది. దీంతో ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. 

రోడ్డు ప్రమాదాలకు, కాలుష్యానికి కారణమవుతున్న వేల్‌మురగన్‌ స్టోన్‌ క్రషర్‌ను సీజ్‌ చేయాలని ఆమె డిమాండు చేశారు. ఇప్పటికే దీనిపై తాను అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. సుమతి కుటుం బాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.