తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేశ్వర ప్రసాద్ చేతివాటం ప్రదర్శించాడు. కరెన్సీ లెక్కింపు మండపంలో నగదును చోరీ చేశాడు. 

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. కరెన్సీ లెక్కింపు మండపంలో నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా అతడు చోరీకి పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే నిందితుడి చేతివాటం గురించి అతడి సహా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘటనపై ఆలయ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకన్నట్టుగా తెలుస్తోంది. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే పరకామణిలో చోరీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి హుండీల లెక్కింపులో కొందరు చేతివాటం చూపించారు. సుమారు రూ.పది లక్షల విలువైన 12 తులాలపైనే బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎస్‌పీఎఫ్‌ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బట్టబయలైంది. మహామండపం వెస్ట్రన్‌ టాయిలెట్‌ పక్కన రెండు చిన్న ప్లాస్టిక్‌ కవర్లను గుర్తించారు. వాటిలో ఒకదానిలో పది బంగారు ఉంగరాలు, మరొకదానిలో ఒక నెక్లెస్‌, ఒక బంగారు తాడు ఉన్నాయి. హుండీల లెక్కింపులో పాల్గొన్న ఉద్యోగులే ఈ బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఆలయ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.