కర్నూల్: కర్నూల్ జిల్లాలోని పెద్దకడబూరు మండలంలోని హెచ్. మురవణి గ్రామానికి చెందిన మహిళ మృతి ఘటనలో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డికి, ప్రభావతి భార్యాభర్తలు.  ప్రభావతికి స్థానికంగా ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయాన్ని పసిగట్టిన వీరారెడ్డి భార్య ప్రభావతిని మందలించాడు. అయినా కూడ ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు.

ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రభావతిని భర్త ఇతర కుటుంబసభ్యులతో గత నెల 31వ తేదీన ఇంట్లోనే కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించి కారులో ఎల్ఎల్‌సీ కాలువలో పడేసి వెళ్లిపోయారు.

అయితే కాలువలో ప్రభావతి పడి ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు ఆమెను కాలువ నుండి బయటకు తీశారు. కాలువ నుండి బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మరణించింది.

వివాహేతర సంబంధం బయటకు తెలిసిందనే తన కూతురు మరణించిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ప్రభావతి శరీరంపై  గాయాలను గుర్తించారు.ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ప్రభావతి భర్త , ప్రభావతి తల్లి, సోదరుడు పోలీసుల ముందు లొంగిపోయారు. 

తామే ప్రభావతిని కొట్టి కాలువలో వేసినట్టుగా ఒప్పుకొన్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత నమోదు చేసిన ఆత్మహత్య కేసును హత్య కేసుగా నమోదు చేశారు.నిందితులు ఉపయోగించిన కారును కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు