Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలి కోసం భార్యను చంపాడు:ట్విస్టిచ్చిన లవర్ హత్య

పెళ్లై భార్య ఉంది. అయినా ఓ టీచర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ప్రియురాలితో వివాహేతర సంబంధం కారణంగా భార్యను చంపాడు. ప్రియురాలి భర్తను కూడ చంపాలని ప్లాన్ చేశాడు.

police arrested for killing lover in guntur district
Author
Amaravathi, First Published Aug 26, 2020, 11:24 AM IST


గుంటూరు: పెళ్లై భార్య ఉంది. అయినా ఓ టీచర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ప్రియురాలితో వివాహేతర సంబంధం కారణంగా భార్యను చంపాడు. ప్రియురాలి భర్తను కూడ చంపాలని ప్లాన్ చేశాడు. అయితే ప్రియురాలు అందుకు ఒప్పుకోలేదు. తమ ఇద్దరి సహజీవనానికి ప్రియురాలు ఒప్పుకోకపోవడంతో చివరకు ఆమెను కూడ హత్య చేశాడు నిందితుడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లాలోని ఏటుకూరుకు చెందిన గొనం శ్రీలక్ష్మి అదే గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూల్ లో స్కూల్ బస్సు డ్రైవర్ గా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నాడు. ఆయనది కొండెపాడు గ్రామం.

2013 లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది. లక్ష్మీనారాయణ భార్య ప్రియాంకకు గుండె సంబంధమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఆమెకు శస్త్రచికిత్స చేయించాడు లక్ష్మీనారాయణ.

అయినా కూడ ఆమె ఆరోగ్యంలో మార్పురాలేదు. అయితే ఈ సమయంలో లక్ష్మీనారాయణ శ్రీలక్ష్మితో  ఓ ప్రతిపాదన చేశాడు. తన భార్యను చంపేస్తాను. ఆ తర్వాత నీ భర్తను చంపేద్దామని ఆమెకు చెప్పాడు. ఇద్దరిని చంపిన తర్వాత పెళ్లి చేసుకొందాని కూడ ఆయన సూచించాడు. 

అయితే ఈ విషయమై తొలుత ఆమె ఒప్పుకొంది. దీంతో లక్ష్మీనారాయణ తన భార్య ప్రియాంకను దిండుతో అదిమి చంపేశాడు.  అయితే తొలుత ప్రతిపాదించినట్టుగా శ్రీలక్ష్మి భర్తను చంపాలని లక్ష్మీనారాయణ కోరాడు.

అయితే తన భర్తను చంపేందుకు శ్రీలక్ష్మి ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఎలా ఉన్నామో అలాగే కలుసుకొందామని శ్రీలక్ష్మి ప్రతిపాదించింది.  అదే సమయంలో లక్ష్మీనారాయణకు దూరంగా ఉంటోంది.

మరో వైపు గతంలో లక్ష్మీనారాయణకు శ్రీలక్ష్మి ఇచ్చిన రూ. 1.07 లక్షలను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఈ డబ్బులు ఇస్తానని చెప్పి శ్రీలక్ష్మిని లక్ష్మీనారాయణ మే 3వ తేదీన కుర్నూతల చెరువు వద్దకు పిలిపించాడు. 

అప్పటికే తన ఇద్దరు స్నేహితులతో లక్ష్మీనారాయణ అక్కడ ఉన్నాడు. శ్రీలక్ష్మిని లక్ష్మీనారాయణ హత్య చేశాడు. అంతేకాదు ఎలుకల మందుతాగి లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ విషయాలు వెలుగుచూశాయి.

పోలీసుల విచారణలోనే తన భార్య ప్రియాంకను కూడ హత్య చేసినట్టుగా లక్ష్మీనారాయణ ఒప్పుకొన్నాడు. అప్పటివరకు ప్రియాంకది సహజ మరణంగానే భావించారు. 
లక్ష్మీనారాయణతో పాటు ఆయన సహకరించిన ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios