అతని పేరు అబద్ధం, ఊరు అబద్ధం.. మాయ మాటలు చెప్పి... ప్రేమ పేరిట యువతికి దగ్గరయ్యాడు.  అతని ప్రేమను నిజమని నమ్మిన యువతి రూ.10లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత తెలిసింది.. అతను డబ్బు కోసం తనను మోసం చేశాడని. ఇంకేముంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పాకాలలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాకాల మండలంలోని మొగరాల పంచాయతీ గొల్లపల్లికి చెందిన నేల్లేపల్లి గుణశేకర్ పాకాలకు చెందిన ఓ యువతిని మోసం చేశాడు.  ఫోన్ రీచార్జి సమయంలో యువతి ఫోన్ నెంబర్ సంపాదించిన నిందితుడు తనది అనంతపురం జిల్లా, గోరంట్ల మండలం, కల్లకుంటకు చెందిన విక్రం సిద్ధార్థ చౌదరిగా పరిచయం పెంచుకున్నాడు. బీటెక్ చదివి గూగుల్ లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి నమ్మించాడు.

నిజమనుకొని నమ్మిన యువతి అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. వేరే వ్యక్తి ఫోటో చూపించి అది తనదేనని నమ్మించాడు. చాలా సార్లు యువతి కలుద్దామని అడిగినా.. ఏదో కారణాలతో వాయిదా వేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆన్ లైన్ ద్వారా యువతి వద్ద నుంచి రూ.10లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు ఎంతకీ ఇవ్వకపోవడంతో.. యువతి మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇటీవల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.