అతను ఓ దొంగ.  స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ వంటి చిన్న వస్తువులతోనే ఎవరికీ అనుమానం రాకుండా చోరీ చేసి వెళ్లిపోతాడు. కేవలం మూడేళ్లలో 58 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. కాగా.. ఇటీవల ఓ ఇంట్లో దొంగతనం చేసి సీసీటీవీ కెమేరాకు చిక్కాడు. దీంతో.. పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ మధురవాడ దరదిలోని ఓ  చర్చి పాస్టర్ ఇంట్లో ఆగస్టు 16వ తేదీన 40 తులాల బంగారం చోరీకి గురయ్యింది. ఇంట్లో సీసీ పుటేజీ , వేలి ముద్రలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఇతని కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి స్థిరపడింది. ప్రభాకర్ చిన్నతనం నుంచే నేరాలకు అలవాటు పడ్డాడు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. గన్నవరం సబ్ జైలు నుంచి 2017లొ విడుదలయ్యాక విశాఖ నగరానికి వచ్చాడు.

మద్దెలపాలెంలో ఉంటూ... నవీన్ అనే వ్యక్తితో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. కేవలం ఈ మూడేళ్ల పరిధిలో 58ఇళ్లల్లో చోరీలు  చేయడం గమనార్హం. మొత్తంగా 111 తులాల బంగారం, 2కిలోల వెండి ఆభరణాలు, రూ.5లక్షల నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 108 తులాల బంగారం, వెండి నగలు రూ.1.69లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.