యువతిని ప్రేమ పేరుతో వేధించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు ఆల్రెడీ పెళ్లి  అయిపోయినా ఆ విషయాన్ని దాచి పెట్టి.. మరో యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వారి దగ్గర రూ.2లక్షల నగదు తీసుకొని.. ఆ తర్వాత మళ్లీ వారిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్తంభాలగరువు ఎల్‌ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే  ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్‌ కోచింగ్‌ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు.

అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు.

యువతి ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.