ఆమెకు పెళ్లైంది. కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. అయితే.. భర్త చనిపోయిన నాటి నుంచి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తోంది. ఆ సమస్యలతో కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది. దీనికి పరిష్కారం కనిపెట్టాలని భావించిన ఓ మహిళ  ఓ స్వామిజీని ఆశ్రయించింది.  ఆ స్వామిజీ కాస్త దొంగ బాబా కావడంతో ఆమెను నట్టేట ముంచి పరారయ్యాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ, రాయుని చెరువు వడ్డిపల్లెక గ్రామానికి చెందిన రామకృష్ణ అలియాస్ రామకృష్ణ స్వామిజీ(47) ఒకప్పుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ తర్వాత గుప్త నిధుల ముఠాలో చేరి ఆ పనులు చేసేవాడు.

Also Read 17రోజులు మద్యం దుకాణాలు బంద్.. ఇంకేమైనా ఉందా!

గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి.. నకిలీ విగ్రహాలను పెట్టి అవే నిజమైన విగ్రహాలను నమ్మించి ప్రజల  దగ్గర నుంచి రూ.లక్షలు కాజేసేవాడు. ఆ తర్వాత స్వామీజీ వేషం కట్టాడు. అతను నిజమైన స్వామి అని నమ్మి అతని వద్దకు వచ్చి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.

ఇటీవల ఓ వివాహిత కూడా ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ ఈ దొంగ స్వామిజీని ఆశ్రయించింది. అయితే... చనిపోయిన ఆమె భర్త ఆత్మగా మారి ఇంట్లోనే తిరుగుతున్నాడని సదరు మహిళను నమ్మించాడు. తాను ఎంతో మందికి భూతవైద్యం చేసి దెయ్యాలను వెళ్లగొట్టానని.. అలా ఇక్కడ కూడా చేస్తానని ఆమెను నమ్మించి రూ.6 లక్షలు తీసుకున్నాడు. 

తరువాత స్వామిజీ కనిపించకుండా మాయమయ్యాడు. అనుమానించిన బాధితురాలు మోసపోయానని నాలుగు రోజుల క్రితం వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి కల్యాణ మండలం సర్కిల్‌ వద్ద కారులో వెళుతుండగా పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు.