విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనితీరుపై ఆరా తీశారు. 

గత ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టింది, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై జగన్ అధికారుల నుంచి ఆరా తీశారు. ఎప్పటికీ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందివ్వగలమని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగారు. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు జగన్‌కు వివరించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించాలని జగన్ నిర్ణయించారు. అనంతరం ఈనెల 6న మరోసారి నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుతోపాటు హంద్రీనీవా వంటి ప్రాజెక్టులపై సీఎం జగన పలు సూచనలు చేశారు. 

అవినీతికి తావు లేకుండా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికను పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4,200 కోట్లను రాబట్టేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. 

పోలవరం ప్రాజెక్టకు సంబంధించి డీపీఆర్ 2కు సంబంధించి టెక్నికల్ గా ఇప్పటికే అనుమతులు లభించినప్పటికీ సీ డబ్ల్యూసీ అనుమతులు ఎందుకు రాలేదని అడిగారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన కల అని దాన్ని పూర్తి చేసేందుకు అధికారులు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే సమీక్షకు పూర్తి వివరాలతో అధికారులు హాజరుకావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.