పోలవరంలో యనమల వియ్యంకుడికి సబ్ కాంట్రాక్టు: జగన్

Polavaram project 20 percent completed from 4 years says ys Jagans
Highlights

బాబుపై జగన్ హాట్ కామెంట్స్

రావులపాలెం:  పోలవరం ప్రాజెక్టులో మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సబ్ కాంట్రాక్టర్ ‌గా పనిచేస్తున్నాడని వైసీపీ చీప్ వైఎస్ జగన్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులు నాలుగేళ్ళలో 20 శాతం కూడ పూర్తి కాలేదన్నారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెంలో శుక్రవారం నాడు జరిగిన సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు పనులు వైఎస్ సీఎంగా ఉన్న కాలంలోనే చాలా వేగంగా సాగాయని ఆయన చెప్పారు.

నాలుగేళ్ళుగా పోలవరం ప్రాజెక్టు పనులు కేవలం 20 శాతం కూడ పూర్తి కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కట్టి  గ్రేట్ వాల్ చైనా ను కట్టినట్టుగా సినిమాను చూపిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కంటే హైద్రాబాద్ లో సీఎం స్వంత  ఇల్లు పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన విమర్శించారు.పనులు పూర్తి చేయకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం పెద్ద డ్రామాగా ఆయన పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  దళారీలకు నాయకుడని జగన్ విమర్శలు చేశారు.స్థానికంగా ఉన్న అరటి రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడ రావడం లేదన్నారు. కానీ,  బాబు హెరిటేజ్ దుకాణంలో మాత్రం ఎక్కువ ధరకు అరటిపండును విక్రయిస్తున్నారని  ఆయన ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం చేశారని  ఆయన ప్రశ్నించారు.  వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించారని ఆయన చెప్పారు. అయితే వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 

ఉప ఎన్నికలు వస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు చేసేదంతా అవినీతి అని,  చూపించేదంతా సినిమాని బాబుపై వైఎస్ జగన్  విమర్శించారు.

నాలుగేళ్ళ క్రితం రొమాన్స్ చేసి నాలుగేళ్ళ పాటు బిజెపి, టిడిపి సంసారం చేశారని జగన్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులుగా కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న కాలంలో  రాష్ట్రానికి చెందిన ఏ అంశాలు కూడ బాబుకు గుర్తుకు లేవని ఆయన చెప్పారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీ, దుగ్గరాజు పోర్ట్ తో పాటు ఇతర అంశాలు  కూడ గుర్తుకు రాలేదన్నారు.
 

loader