ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అలాగే అల్లూరి కుటుంబ సభ్యులను మోదీ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ.. అల్లూరి కుటుంబ సభ్యులను సత్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని కొనియాడారు. అనంతరం హిందీలో మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తామని తెలిపారు.
యావత్ భారతవనికి అల్లూరి స్పూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు. అల్లూరి జయంతి రోజు మనందరం కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి అని.. వీర భూమి అని చెప్పారు. అల్లూరి పుట్టిన ఈ పుణ్య భూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా తెలిపారు.
‘‘రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. మన్యం వీరుడు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం. అల్లూరికి దేశం తరఫున శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టుగా చెప్పారు. మొగల్లులో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం, పాండ్రంగిలో అల్లూరి జన్మస్థలం పునరుద్ధరణ, చింతపల్లి పోలీస్ స్టేషన్ పునరుద్ధరణ చేస్తాం. చెప్పారు. ఈ పనులు మన అమృత స్ఫూర్తికి ప్రతీకలుగా నిలుస్తాయి’’ అని మోదీ తెలిపారు.
‘‘అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. స్వాతంత్ర్య సాధనలో పోరాట పటిమ గురించి అందరికి తెలియాలి. స్పూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. త్యాగధనులను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగింది. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీకగా అల్లూరి సీతారామరాజు నిలిచారు.
మన్యం వీరుడిగా అల్లూరి ముందకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. అల్లూరి గిరిజన సమాజం పట్ల సమదృష్టి, ఆప్యాయత, త్యాగం, ధైర్యాన్ని అందించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో యువత ముందుకు వచ్చి దేశ స్వాతంత్య్రానికి నాయకత్వం వహించారు. నవ భారత కలలను నెరవేర్చుకునేందుకు ముందుకు రావడానికి నేటి యువతకు ఇదే అత్యుత్తమ అవకాశం. నేడు దేశంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ వీరుల, దేశభక్తుల భూమి. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పోట్టి శ్రీరాములు వంటి మహానుభావులు జన్మనిచ్చిన గడ్డ ఆంధ్రప్రదేశ్. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల కల సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
గడిచి 8 ఏళ్లుగా దేశ అభివృద్దికి, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. యువతకు, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. ఆదివాసీల బలిదానాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రత్యేకించి అల్లూరి, ఇతర పోరాట యోధుల ఆదర్శాలను అనుసరిస్తూ గిరిజన సోదర సోదరీమణుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహోరాత్రులు కృషి చేసింది.
స్వాతంత్య్రానంతరం తొలిసారిగా దేశంలోని గిరిజనుల గౌరవాన్ని, వారసత్వాన్ని చాటిచెప్పేందుకు గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నారు. “అల్లూరి సీతారామ రాజు మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం” కూడా ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిలో నిర్మిస్తాం. గత ఏడాది నుంచి నవంబర్ 15న బిర్సా ముండా జయంతిని నేషనల్ ట్రైబల్ ప్రైడ్ డేగా జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది.
నేడు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా గిరిజన కళ-నైపుణ్యాలు కొత్త గుర్తింపు పొందుతున్నాయి. 'వోకల్ ఫర్ లోకల్' గిరిజన కళా నైపుణ్యాలను ఆదాయ మార్గంగా మారుస్తోంది. గిరిజనులు వెదురు వంటి అటవీ ఉత్పత్తులను నరికివేయకుండా నిరోధించే దశాబ్దాల నాటి చట్టాలను మార్చాం. అటవీ ఉత్పత్తులపై వారికి హక్కులు కల్పిస్తున్నాము.
నేడు ప్రభుత్వం అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అనేక కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం. 8 ఏళ్ల క్రితం వరకు కేవలం 12 అటవీ ఉత్పత్తులను మాత్రమే ఎంఎస్‌పీతో కొనుగోలు చేసేవారు. కానీ నేడు MSP కొనుగోలు జాబితాలో దాదాపు 90 ఉత్పత్తులు అటవీ ఉత్పత్తులుగా చేర్చబడ్డాయి. వన్ ధన్ యోజన ద్వారా అటవీ సంపదను ఆధునిక అవకాశాలతో అనుసంధానించే పనిని దేశం ప్రారంభించింది. దేశంలో 3 వేలకు పైగా వన్ ధన్ వికాస్ కేంద్రాలతో పాటు, 50 వేలకు పైగా వన్ ధన్ స్వయం సహాయక బృందాలు కూడా పనిచేస్తున్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
