టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.. తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తిరుమల పవిత్రత, పర్యావరణం, స్వచ్ఛ తిరుమలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇవాళ్టీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ. 25 వేల జరిమానా విధిస్తామని.. రెండోసారి ఉల్లంఘిస్తే షాపు లైసెన్సులు రద్దు చేస్తామని టీడీపీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని..అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు సైతం అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి కోటా ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్ విధానంలో ఆన్‌లైన్‌లో టీటీడీ జారీ చేయనుంది.

విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంట్ బుకింగ్ కింద వెంటనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరణ కోసం తిరుమల అన్నమయ్య భవన్‌లో ప్రతినెలా మొదటి శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించనుంది.