కాకినాడ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా కావడంతో ఈ ప్రాంతంలో జరిగే రాజకీయ పరిణామాలను పట్టుకోవడం ఎవరితరం కాదు. జనసేనలోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ జనసేనకు జై కొట్టారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరోబలమైన నేత పితాని బాలకృష్ణ జనసేనకు జై కొట్టారు. తొందర్లోనే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 

                                                    

ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే పితాని బాలకృష్ణ జనసేనలోకి జంప్ అవుతున్నారు. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా పితాని బాలకృష్ణ పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్  కుమార్ పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలను నిర్వహిస్తున్న బాలకృష్ణ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. 

తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై జిల్లాలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలను భారీగా నిర్వహించారు. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ఆహ్వానించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈదశలో వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముమ్మడివరం నియోజకవర్గాన్నిశెట్టిబలిజీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాహాటంగానే విమర్శించారు. 

ముమ్మిడివరం నియోజకవర్గం టిక్కెట్ ను పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కే ఫైనల్ అయినట్లు తెలియడంతో నియోజకవర్గానికి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలతో సమావేశమైన పితాని బాలకృష్ణ ప్రజా సంకల్ప యాత్రకు దూరంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్గొనలేదు. దీంతో నియోజకవర్గంలోని పాదయాత్ర బాధ్యతలను ఇంచార్జ్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దగ్గరుండి చూసుకున్నారు. 
 
దీంతో పితాని బాలకృష్ణ రాజకీయభవితవ్యంపై పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చడంతో తొరలో పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పితాని బాలకృష్ణ రాకను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్లు తెలిపారు.   

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం బీసీ సామాజిక వర్గానికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు...శెట్టిబలిజ సామాజి వర్గాలు గెలుపు ఓటములను నిర్ధారిస్తాయి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు కేటాయించింది. దీంతో రెండు సార్లు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరపున పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బరిలో నిలవగా వైసీపీ తరపున శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గుత్తుల సాయి బరిలో దిగారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అగ్రవర్ణాలకు చెందిన దాట్ల బుచ్చిరాజును బరిలోకి దింపగా....దాట్ల బుచ్చిరాజు గెలుపొందారు.  

ఎన్నికల అనంతరం గుత్తుల సాయి తెలుగుదేశం పార్టీలో చేరడంతో నియోజకవర్గ ఇంచార్జ్ పదవి పితాని బాలకృష్ణకు అప్పగించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ఇటీవలే వైసీపీలోకి  చేరిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేరడంతో పితాని బాలకృష్ణను తప్పించి పొన్నాడను నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. ఇలా నాలుగేళ్లలో ముగ్గురు నియోజకవర్గ ఇంచార్జ్ లను మార్చడం పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పార్టీ అధినేత జగన్ నియోజకవర్గంపై దృష్టిపెట్టకపోతే గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.