హర్ష కుమార్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ.. వైసీపీలో చేరడం ఖాయమేనా..?
కాంగ్రెస్ నేత, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వైసీపీలో చేరనున్నట్టుగా ప్రచారం సాగుతుంది.

కాంగ్రెస్ నేత, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వైసీపీలో చేరనున్నట్టుగా ప్రచారం సాగుతుంది. గతంలో కూడా హర్షకుమార్.. పార్టీ మారనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన టీడీపీలో చేరడం ఖాయమైపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగులు పడలేదు. అయితే తాజాగా హర్ష కుమార్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కావడంతో ఆయన వైసీసీలో చేరనున్నారనే ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే హర్షకుమార్ మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు.
అయితే ఇటీవల ఏపీ కాంగ్రెస్‌లో మార్పులు చేపట్టిన పార్టీ అధిష్టానం.. పలు కమిటీలను ఏర్పాటు చేసింది. కొత్త పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజును నియమించింది. హర్షకుమార్‌కు క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవిని అప్పజెప్పింది. అయితే.. ఆ పదవికి హర్షకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు హర్షకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి తిరస్కరణ లేఖ కూడా పంపారు. పీసీసీ చీఫ్ పదవి ఆశపెట్టుకున్న హర్షకుమార్.. ఆ దిశగా నిర్ణయం వెలువడకపోవడంతో అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో హర్షకుమార్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ మంతనాలు జరపడం.. సరికొత్త చర్చకు దారితీసింది. హర్షకుమార్ వైసీపీలోకి చేరడం లాంఛనమే అన్న ప్రచారం సాగుతుంది. ఆయనకు రానున్న ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయనతో మంతనాలు జరిపారని ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా అధికార వైసీపీపై పలు సందర్భాల్లో హర్షకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కూడా కామెంట్స్ చేశారు. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతన్న ప్రచారంలో నిజం ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.