ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ంటూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. క‌రోనా సెకండ్ వేవ్ మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న ద‌శ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నుకుంటున్న ప్ర‌భుత్వానికి ఎన్ని విన‌తులు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో విద్యార్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు.

క‌రోనా ఉధృతంగా ఉన్న స‌మయంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం విద్యార్థుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డమేన‌ని వారు హెచ్చరించారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌డ‌మో, వాయిదా వేయ‌డ‌మో చేయాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు.

Also Read:టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గని వైఎస్ జగన్: భవిష్యత్తుకు నష్టమని వాదన

అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్స‌ప్ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు లోకేష్‌. దీనికి ల‌క్ష‌లాది మంది ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని సందేశాలు పంపారు.

అలాగే ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన టౌన్‌హాల్ మీటింగ్‌లో పిల్ల‌ల ప్రాణాలే ముద్దు, ప‌రీక్ష‌లు వ‌ద్ద‌నే అంశంపై న్యాయ‌పోరాటం చేయాల‌ని మెజారిటీ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు క‌రోనా సెకండ్‌వేవ్ ప‌రిస్థితులు వివ‌రిస్తూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ బుధ‌వారం హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు.

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona