అమరావతి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. "మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో పేర్కొన్న ఫోన్ టాపింగ్ వంటి పలు అంశాలకు సంబంధించి  మీ వద్ద ఉన్న ఎటువంటి సాక్ష్యాధారాలలైన ఉంటే మాకు అందజేయగలరని కోరుతున్నాను" అని ఆయన లేఖలో రాశారు

"రాష్ట్రంలోని పౌరులకు రక్షణ కల్పించడం, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా దృడ సంకల్పంతో  ఉన్నామని తమరికి తెలియజేస్తున్నాను" అని ఆయన అన్నారు." మాకు పూర్తిస్థాయిలో సహకరించి పౌరుల హక్కులను కాపాడేందుకు, రూల్ ఆఫ్ లా ను అమలు పరచేందుకు సహకరించగలరని కోరుతున్నాను" అని ఆయన అన్నారు. 

"ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, తదితరుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మీరు ప్రధాని లేఖ రాశారని, దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారని, మీడియాలో అది వచ్చింది" అని గౌతమ్ సవాంగ్ ఆ లేఖలో చంద్రబాబుకు గుర్తు చేశారు. 

కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని, పరికరాలను వాడుతూ ప్రైవేట్ వ్యక్తులు, అల్లరి మూకలకు చెందినవారు ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు రాశారని, ఇందుకు సంబంధించి తమకు ఇప్పటి వరకు ఏ విధమైన ఫిర్యాదు కూడా రాలేదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. 

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దానికి ప్రతిగా గౌతమ్ సవాంగ్ చంద్రబాబుకు ఆ లేఖ రాశారు.