న్యూ ఇయర్ రోజే ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒక్కగానొక్క కూతురి మరణంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన విజయవాడలో  విషాదాన్ని నింపింది. 

విజయవాడ, భవానీపురం మీరా సాహెబ్ వీధికి చెందిన మంగు నాగబాబు, జయలక్ష్మిల కూతురు దేవి ప్రియాంక(25). ఆమె గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో పల్మనాలజీ ఎండీ సెకండియర్ చదువుతోంది. రోజూలాగే గురువారం కాలేజీకి వెళ్లి వచ్చింది. న్యూఇయర్ వేడుకల సందర్బంగా తల్లి దండ్రులు చుట్టాల ఇంటికి వెడుతూ రమ్మని పిలిచారు. చదువుకోవాలని రాలేనని చెప్పింది ప్రియాంక. ఆమెను ఇంట్లోనే వదిలి వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి 9.30గం.లకు తిరిగి వచ్చారు.

కూతురి గదిలో చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించడంతో షాక్ తిన్నారు. వెంటనే 108కు ఫోన్ చేశారు. వారు వచ్చి చూసి అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ప్రియాంక ల్యాప్ టాప్, డైరీను చూడగా అందులో సారీ డాడీ.. ఐలవ్ యూ డాడీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం డాడీ.. అమ్మా నువ్వంటే చాలా ఇష్టం.. బాయ్ అమ్మా.. బాయ్ నాన్నా.., నవీన్ వల్లే నేను చనిపోతున్నా అని రాసి ఉంది.

దీంతో తల్లిదండ్రులు భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఇటీవల దేవీ ప్రియాంకకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇప్పటికే 4,5 సంబంధాలు చూసినా దేవీ ఒప్పుకోలదని సమాచారం. అయితే ఆమె మనసులో ఉన్న విషయం కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. చెప్పినా ఒప్పుకోరని ఇలా చేసి ఉంటుందని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ప్రియాంక్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఫోన్, ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు. నవీన్ ఏవరో తెలిస్తే ప్రియాంక మృతికి కారణం తెలుస్తుందని అంటున్నారు.