తిరుమలలో డిక్లరేషన్ ను టీటీడీ సరిగా అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం విచారించింది. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి వారిని ఉత్సవాల్లో వాహన సేవ మాడ వీధుల్లో ఊరేగించకుండా ఆలయంలోని వాహన సేవ చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

స్వామి వారి పాదాలు కనిపిస్తేనే సంపూర్ణ దర్శనమని, భక్తుల రద్దీ పేరు చెప్పి టీటీడీ దూరం నుంచే భక్తులకు స్వామి వారి పాదాలు కనిపించకుండా చేస్తున్నారన్న న్యాయవాది ఆరోపించారు.

స్వామి వారికి వస్త్రాలు ఉంచి స్నానం చేయించాలని, అలా కాకుండా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వస్త్రాలు తొలగించి స్నానం స్వామి వారికి చేయిస్తున్నారన్న ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.

దీనిపై స్పందించిన కోర్టు అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. అయితే ఆగమ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు టీటీడీ వద్దే ఉన్నాయని పిటిషనర్ తెలిపారు.

ఇదే సమయంలో పిటిషన్ వేశారు కాబట్టి ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ ను న్యాయమూర్తి కోరారు. ఇందుకు కాస్త వ్యవధి కావాలని పిటిషనర్ కోరడంతో న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.