అనకాపల్లిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా కోసి నిర్జనప్రదేశంలో పడేశారు. సంక్రాంతి వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అనకాపల్లి : అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికారు. తల, మొండెం, కాళ్లను వేరువేరుగా నరికి పడేశారు. అనకాపల్లిలోని ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు స్థానికులకు కనిపించాయి. దీంతో వెంటనే వీరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు.
అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. సంక్రాంతి పండుగరోజు ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్తానికంగా కలకలం రేగింది. పండగ సెలవులు కావడంతో స్థానిక యువకులు క్రికెట్ ఆడేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దుర్వాసన వస్తుండడం.. వారి బంతి వెళ్లి పడినచోట డెడ్ బాడీ శరీరభాగాలు కనిపించడంతో వెంటనే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతదేహం ఉన్న తీరును బట్టి ఆ హత్య నాలుగైదు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శరీరంలోని మరికొన్ని భాగాలు ఇంకా దొరకాల్సి ఉంది.
హత్యకు ఆర్థిక లావాదేవీలా, మరేదైనా కారణమా.. అని అనుమానిస్తున్నారు. స్థానికంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అతడిని అతి దారుణంగా హత్య చేయడం వెనుక ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం ఎవరిది అనే విషయం తొందర్లోనే వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం : కాలిబూడిదైన వాహనాలు.. ప్రమాదమా, ఆకతాయిల పనా..?
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో డిసెంబర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసి15 ముక్కలుగా నరికాడు. ఆ తరువాత మంటూరు బైపాస్ రోడ్డు సమీపంలోని పొలంలో ఉన్న బోరుబావిలో తండ్రి శరీర భాగాలను పడేశాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మృతుడు పరశురామ్ కులాలి (54), నిందితుడిని విఠల్ కులాలిగా గా గుర్తించారు. డిసెంబరు 6న ముధోల్‌లో ఈ ఘటన జరిగింది. భర్త కనిపించకపోవడంతో మృతుడి భార్య పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. దీని మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
విచారణలో నిందితుడు విఠల్ నేరం అంగీకరించాడని బాగల్‌కోట్ ఎస్పీ జయప్రకాష్ తెలిపారు. మృతుడు పరశురాంకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 53 ఏళ్ల పరశురాం మద్యానికి బానిసై తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠలను నిత్యం దుర్భాషలాడేవాడు. పరశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. డిసెంబర్ 6న పరశురాం మద్యం మత్తులో కుమారుడితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశానికి లోనైన 20 ఏళ్ల కొడుకు ఇనుప రాడ్డుతో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఇది ముధోల్ పట్టణానికి సమీపంలోని మంటూరు బైపాస్ వద్ద ఉన్న వీరి పొలంలో జరిగింది.
తండ్రిని చంపిన తరువాత మృతదేహాన్ని ఉపయోగంలో లేని బోరుబావిలో దాచడానికి ప్రయత్నించాడు. కానీ బోరుబావి వెడల్పు 6-8 అంగుళాలు మాత్రమే ఉండటంతో అది చేయలేకపోయాడు. దీంతో విఠల్ తండ్రి మృతదేహాన్ని ముక్కలుగా నరకాలని నిర్ణయించుకున్నాడు. అలాగే చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు.
