వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
అమరావతి : మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ హత్యతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు, వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తున్న సిబిఐ అధికారులు ఏ క్షణానయినా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం. ఈ ప్రచారానికి బలాన్నిస్తే తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇలా వివేకా హత్యకేసులో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
వివేకా హత్య కేసు విచారణలో దురుద్దేశాలు ఉన్నాయని నాని అన్నారు. గతంలో సిబిఐ అధికారి రాంసింగ్ నేతృత్వంలో సాగిన ఈ కేసు విచారణ తప్పుడు మార్గంలో వెళుతోందని స్వయంగా సుప్రీం కోర్టు చెప్పిందని మాజీ మంత్రి గుర్తుచేసారు. అయితే ఆయన తర్వాత వచ్చిన అధికారి కూడా విచారణను పాత పద్దతిలోనే కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ హత్యకేసును విచారిస్తున్న సిబిఐ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వున్నాయని అవినాష్ చెబుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా సిబిఐ విచారణ ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సాగాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నారు. ఏదైమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.
Read More అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం: ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక వాదనలు
ఇదిలావుంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ(సోమవారం) సిబిఐ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి వెళ్లిన అవినాష్ రెడ్డిని విచారించకుండానే రేపు(మంగళవారం) ఉదయం 10.30 గంటలకు రావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసింది. దీంతో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.
తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అవినాష్ ను కూడా సిబిఐ అరెస్ట్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విచారణ సమయంలో సీబీఐ అధికారులు అవినాష్ ను విచారణకు పిలిచినట్టుగా న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
నిన్న సీబీఐ ఇచ్చిన నోటీసు మేరకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హైద్రాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా జరిగిన వాదనల నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు విచారించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ మరోసారి నోటీసు ఇచ్చారు. రేపు ఉదయం 1030 గంటలకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డిని కోరారు సీబీఐ అధికారులు. ఇవాళ విచారణ లేకపోవడంతో సీబీఐ కార్యాలయం నుండి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.
