వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ కల్యాన్ కేరాఫ్ అడ్రస్ అంటూ పేర్ని నాని ఫైరయ్యారు.  

కొత్త మంత్రులకు సంబంధించి పేర్ని నాని (perni nani) కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవాన్ని, సామర్ధ్యాన్ని బట్టి ఎవరినీ పార్టీకి వినియోగించుకోవాలి.. ఎవరినీ ప్రభుత్వానికి వాడుకోవాలన్నది జగన్ (Ys jagan) నిర్ణయిస్తామన్నారని మంత్రి చెప్పారు. సంతోషంగానే రాజీనామాలు చేశామని తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకుంటామని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) ఏదో హబీగా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఫుల్ టైం పొలిటిషియన్ వేరని.. పార్ట్‌టైం పొలిటిషియన్ వేరంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ మాట మీద ఎప్పుడైనా నిలబడ్డారా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ మార్చినట్లుగా మాట మారిస్తే తనను ఎన్నిసార్లు కొట్టేవారోనంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

2012లో పార్టీ పెట్టేముందు చంద్రబాబును (chandrababu naidu) కలవాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఆయనేమైనా ఎన్నికల కమీషనరా అంటూ మంత్రి నిలదీశారు. చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి (narendra modi) ఓటేయమని పిలుపునిచ్చారని పేర్ని నాని గుర్తుచేశారు. బీజేపీకి (bjp) నాకు సంబంధం లేదని చెప్పిన పవన్ వాళ్లతోనే పొత్తు పెట్టుకున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు. 2014లో పవన్ ఎవరి పల్లకినీ మోశారని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబంటే విపరీతమైన వ్యామోహం.. జగన్ అంటే ద్వేషమని మంత్రి ఫైరయ్యారు. ఇప్పుడు బీజేపీతో కలిసి చంద్రబాబుతో టచ్‌లో వుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్లుందని చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ కేరాఫ్ అడ్రస్ అని పేర్ని నాని అన్నారు.

ఒకప్పుడు జనసేన (janasena) ఆఫీసుల్లో చెగువెరా ఫోటోలు వుండేవని.. ఇప్పుడు పవన్ ఒంటినిండా చంద్రబాబేనంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ నా ఫ్యాన్ అంటూ వ్యాఖ్యానించారు. ఫైరవీలు, రికమండేషన్‌లు జగన్ వద్ద నడవ్వని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 22000 కోట్ల రూపాయలు విద్యుత్ కంపెనీలకు అప్పులు పెట్టి పారిపోయిందని మంత్రి ఆరోపించారు. కరెంట్‌ని అప్పుపై కొనుగోలు చేసేందుకు , విక్రయించేందుకు వీలు లేకుండా మోడీ చట్టం చేశారని పేర్ని నాని అన్నారు. 22 వేల కోట్ల అప్పు మూడేళ్లలో తీర్చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. 

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ భేటీ వివరాలను పేర్ని నాని మీడియాకు వివరించారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పుపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదును సీఎం జగన్ విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. 

7 మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 8 మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ (ap cabinet) ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త 12 ఉద్యోగాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసిందన్నారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. వైద్య సిబ్బందిని నియమించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్ని నాని చెప్పారు. 


ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

ఏపీ మిల్లెట్ మిషన్‌కు ఆమోదం
ఆముదాలవలస మండలం తొగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కోసం 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
ప్రకాశం జిల్లా దర్శి డిగ్రీ కాలేజ్‌లో 34 టీచింగ్ పోస్టుల మంజూరుకు ఆమోదం
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నియమ నిబంధనల తయారీకి ఆమోదం
ఇప్పటికే వైద్యాధికారులు, అనుబంధ సిబ్బంది నియామకం
హెల్త్ హబ్స్ కోసం కార్పోరేషన్స్‌లో భూముల కేటాయింపు