కోహినూర్ వజ్రం దొరికిన మట్టిలోనే మరో వజ్రమట... ఎగబడుతున్న ప్రజలు (వీడియో)
కోహినూర్ వజ్రం దొరికిన కొల్లూరు మట్టిలో మరో వజ్రం దొరికిందంటూ పల్నాడు జిల్లాలో ప్రచారం జోరందుకుంది.

నరసరావుపేట : ప్రపంచలోని చాలా అరుదైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. ఈ వజ్రం ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో లభించిందని చరిత్ర చెబుతోంది. ఇంతటి విలువైన వజ్రం దొరికిన ప్రాంతానికి చెందిన మట్టిలో మరో వజ్రం దొరికినట్లు ప్రస్తుతం పల్నాడు జిల్లావ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమో, అబద్దమో తెలీదుగానీ ప్రజలు మాత్రం వజ్రం దొరికినట్లుగా ప్రచారం జరుగుతున్న ప్రాంతంలో వజ్రాల వేట ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ వెంచర్ ఏర్పాటవుతోంది. ఈ వెంచర్ ను చదునుచేసేందుకు కోహినూరు వజ్రం దొరికిన కొల్లూరు ప్రాంతంనుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టిలో ఓ వ్యక్తికి వజ్రం దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదికాస్తా జిల్లామొత్తానికి పాకడంతో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్దమయ్యారు.
వీడియో
వజ్రం దొరికినట్లు ప్రచారమవుతున్న కేసానుపల్లికి వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. సదరు ప్రైవేట్ వెంచర్ కు చేరుకుని వజ్రాల కోసం వెతుకుతున్నారు. కొందరు తమకు దొరికిన రంగురాళ్లను తీసుకుని అవేమైనా వజ్రాలేమోనని పరీక్ష చేయించడానికి తీసుకెళుతున్నారు. ఇలా కోహినూరు వజ్రం దొరికిన మట్టిలో మళ్లీ వజ్రాల వేట మొదలయ్యింది.