చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజలు బాధపడడం లేదు.. టీడీపీ నిరసనలపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
Amaravati: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనీ, ఈ క్రమంలోనే బలవంతపు నిరసనలు చేస్తోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh Tourism Minister RK Roja: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనీ, ఈ క్రమంలోనే బలవంతపు నిరసనలు చేస్తోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా టీడీపీ, జనసేనలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్నందుకే చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టారనీ, ఆయనను అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి రోజా అన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజల మద్దతు పొందేందుకు టీడీపీ నేతలు బలవంతంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని రోజా ఆరోపించారు.
చంద్రబాబు తన అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకు తన కుమారుడు లోకేశ్, నటుడు బాలకృష్ణ, కోడలు భువనేశ్వరి, పవన్ కల్యాణ్ లను వాడుకుంటున్నారని ఆరోపించారు. చివరికి ఈ ఎత్తుగడలు కూడా పనిచేయలేదని రోజా పేర్కొన్నారు. బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దించారనీ, తీరా చూస్తే ఈ అస్త్రం కూడా తుస్సుమందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి రోజా తీవ్రంగా మండిపడ్డారు. పవన్ జైల్లో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారనీ, తనను నమ్మిన అభిమానులను మోసం చేశారని ఆరోపించారు.
"తన తల్లిని తిట్టించిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ ఫొటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డిల చేతిలో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. ఇన్నేళ్లయినా ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. ఇప్పటికీ ఇతర పార్టీల జెండాలను మోసే కూలీగానే పవన్ కళ్యాణ్ మిగిలిపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయిన పవన్ కు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ, పేదల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. పవన్ కు కనీసం పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించిన రోజా, ఎలాంటి రాజకీయ పోరాటానికైనా వైకాపా ఎప్పుడూ సిద్ధంగానే ఉందని వ్యాఖ్యానించారు.