గ్రామసభలు నిర్వహించేటప్పుడు సభలో జరిగే అన్నీ వివరాలను మినిట్స్ బుక్ లో అధికారులు రికార్డు చేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశించినా అధికారులు ఏమాత్రం లెక్క చేయటం లేదు.

రాజధాని గ్రామాల్లో సిఆర్డిఏని రికార్డుల రగడ వదిలేట్లు లేదు. తాజాగా పెనుమాక గ్రామంలో అధికారులకు, రైతులకు మధ్య సమావేశం పెద్ద రాసాబాసైంది. రాజధానికి భూములు ఇవ్వని గ్రామాల్లో భూములు తీసుకునేందుకు సిఆర్డిఏ అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ సభ నిర్వహించినా తమ అభ్యంతరాలను రికార్డు చేయాలంటూ గ్రామస్తులు పట్టుబడుతున్నారు. అందుకు అధికారులు సాధ్యం కాదంటున్నారు. తమ అభిప్రాయాలను రికార్డు చేయమంటే అధికారులు ఎందుకు ఇష్టపడటం లేదో అర్ధం కావటం లేదని రైతులు, స్దానికులు మండిపడుతున్నారు.

ఈరోజు పెనుమాక గ్రామంలో జరిగిందదే. భూములు ఇవ్వని రైతులతో సిఆర్డిఏ అధికారులు సమావేశం ఏర్పాటు చేసారు. ఏడాదికి మూడు పంటలు పండే తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. రాజధాని కోసం భూములు ఇవ్వాల్సిందేనంటూ అధికారులు కూడా గట్టిగానే చెప్పారు. ఇక్కడే రెండువర్గాల మధ్య వివాదం మొదలైంది.

రాజదాని కోసం భూములు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడకపోయినా ప్రభుత్వం భూములను తీసుకునేది మాత్రం ఖాయమంటూ అధికారులు రైతులను బెదిరించారు. దాంతో తమ అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయమని రైతులు డిమాండ్ చేసారు. అందుకు అధికారులు అంగీకరించలేదు. దాంతో ఇరువైపులా పెద్ద వాగ్వాదం జరిగింది.

చివరకు ఒళ్ళు మండిన రైతులు టెంటును ఊడబీకేసారు. కుర్చీలను విసిరేసారు. మైకులను లాగేసారు. దాంతో పోలీసుల సాయంతో అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. గ్రామసభలు నిర్వహించేటప్పుడు సభలో జరిగే అన్నీ వివరాలను మినిట్స్ బుక్ లో అధికారులు రికార్డు చేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశించినా అధికారులు ఏమాత్రం లెక్క చేయటం లేదు.