Asianet News TeluguAsianet News Telugu

పెగాసస్ వివాదం... వైసిపి ఎమ్మెల్యేపై పరువునష్టం దావా... మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబివి ప్రకటన

పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుపై వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఏబివి ప్రకటించారు. 

pegasus spyware issue...  file a defamation suit against ycp mla gudiwada amarnath... ab venkateshwar rao
Author
Amaravati, First Published Mar 23, 2022, 5:21 PM IST

విజయవాడ: గతంలో దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ (pegasus spyware) ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష టిడిపి (TDP)ని చిక్కుల్లోకి నెట్టింది. ఏపీలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నారు.మమతా వ్యాఖ్యలు అధికార వైసిపి మంచి అస్త్రంగా మారాయి. ఈ క్రమంలోనే టిడిపిపై అధికార వైసిపి నాయకులు విరుచుకుపడుతున్నారు. 

అయితే ఈ పెగాసస్ వివాదంపై టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వర రావు (AB Venkateshwar rao) స్పందించారు. 2019 మే వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను వాడలేదని ఆయన స్పష్టం చేసారు. ఇలా టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన వెంకటేశ్వర రావుపై వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ (gudiwada amarnath) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

తాజాగా గుడివాడ అమర్నాథ్ తనపై చేసిన ఏబి వెంకటేశ్వర్ రావు ఆరోపణలపై స్పందించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అమర్నథ్ పై కోర్టుకు వెళతానని... పరువు నష్టం దావా వేస్తానని వెంకటేశ్వర రావు ప్రకటించారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలపై అమర్నాథ్ వద్ద ఏవయినా ఆదారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వాలని వెంకటేశ్వర రావు సూచించారు. 

వైసిపి ఎమ్మెల్యే అమర్నాథ్ వ్యాఖ్యలు ఆధారాలు లేకుండా చేసినవేనన్న విషయం స్కూలుకు వెళ్లి చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందన్నారు. ఇప్పటికే తనపై నిరాధార ఆరోపణలు చేసిన పలువురు ప్రజాప్రతినిధులు పై పరువునష్టం దావా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా ఎమ్మెల్యే అమర్నాథ్ పైనా దావా వేయనున్నట్లు ఐపిఎస్ ఏబి వేంకటేశ్వర్ రావు వెల్లడించారు. 

ఇదిలావుంటే నిన్న(మంగళవారం) పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఏపీ వెంకటేశ్వరరావు ఐపిఎస్ కాదని... ఇజ్రాయల్ పెగాసస్ సాఫ్ట్ వేర్ అన్నట్లుగా వుందన్నారు. ఆయన ఐపీఎస్ కి కాదు కనీసం హోమ్ గార్డ్ గా కూడా పని చేయడానికి అర్హుడు కాదని అన్నారు. నిజాలు మాట్లాడితే వెంకటేశ్వర రావు తమ మీద డిఫర్మేషన్ వేస్తాం అంటున్నారు... కానీ ఆయనమీద 5 కోట్ల రాష్ట్ర ప్రజలు డిఫర్మేషన్ వేస్తారన్నారు. 

సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడని ఏబీవీ అంటున్నాడని... కానీ ఐపీఎస్ గా 30 ఏళ్ళు సర్వీసులో ఉండి తనను తాను కాపాడుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే అమర్నాథ్ ఎద్దేవా చేసారు. ఇదిచాలు పోలీసు అధికారిగానే ఏబీవీ అన్ ఫిట్ అని చెప్పడానికి అని అమర్నాథ్ పేర్కొన్నారు. 

పెగాసస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేసినట్లు అన్నది మేం కాదు... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారని అమర్నాథ్ పేర్కొన్నారు. శాసనసభలో ఈ అంశం పై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది... ఎందుకు పారిపోయారు..? అని నిలదీసారు. పెగాసస్ స్పై వేర్ ను వాళ్ళే కొనుగోలు చేస్తారు.... మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వాళ్లే ఒకరికి ఒకరు వత్తాసు పలుకుతుంటారని అన్నారు.  లోకేష్ సవాళ్ళు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే అమర్నథ్. 

 చంద్రబాబు ఒక పొలిటికల్ పర్వర్టెడ్... ఆయనకు విలువలు లేవు, విశ్వసనీయత లేదన్నారు. అనైతిక, అరాచక, దుర్మార్గపు రాజకీయాలను చేసిన వ్యక్తి ఆయనని... ఇటువంటి చంద్రబాబు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదని వౌసిపిఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios