అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదో సాధించాలని చంద్రబాబు నాయుడు చతికిల పడ్డారని ఆయన వ్యాక్యానించారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారని. ఫలితాల లెక్కలను తారుమారు చేసినంత మాత్రాన జరిగేదేమీ లేదని ఆయన అన్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 80.37 శాతం స్థానాలను దక్కించుకున్నారని, ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఫలితాలు వచ్చాయని అన్నారు. 

కుప్పం ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్ాలలో వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుపొందడంపై జగన్ రామచంద్రా రెడ్డిని అభినందించారు. 

ఇదిలావుంటే, కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ సోమవారం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని పెద్దిరెడ్డి మీడియాతో అన్నారు సీఎం వైఎస్ జగన్ పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు.