విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు ఆదేశాలు జారీచేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

ఇక విజయవాడ నగరంలో ఈ తరహాలో ప్రైవేట్ హోటళ్ళలో నిర్వహిస్తున్న కోవిడ్ చికిత్స కేంద్రాల్లో అన్ని రక్షణ సదుపాయాలు వుండేలా తనిఖీలు చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రిపెద్దిరెడ్డి కోరారు.

READ MORE   విజయవాడ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం... సీఎం జగన్ కు ప్రధాని ఫోన్

విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. 

 ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర కోవిడ్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు మృత్యువాతపడగా చాలామంది తీవ్ర అస్వస్ధతకు గురయినట్లు తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ  అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.