అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఉన్నారని, ఆయన వద్ద కూడా తాను పనిచేశానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తే బాగుంటుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతున్నారని, చిత్తూరు జిల్లా పర్యటనలో ఆ విషయం చెప్తే బాగుంటుందని ఆయన అన్నారు.

తాము ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు చేయడం లేదని మంత్రి మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి సహాయం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీవాళ్లు దౌర్జన్యం చేస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు. దళితులపై టీడీపీవాళ్లు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

తన నియోజకవర్గంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీవాళ్లు దౌర్జన్యాలు చేస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం యాప్ ను ఎవరు తయారు చేస్తున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ వ్యక్తి తయారు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.