చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఇటు అయినా లబ్ధి పొందే ఏకైక కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబమేనంటూ వార్త రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. అంతేకాదు తక్కువగా మాట్లాడటం చాపకింద నీరులా రాజకీయం చెయ్యడంలో నేర్పరి. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతారు. 

చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే వైఎస్ కుటుంబానికి చాలా అభిమానం. ఈ నేపథ్యంలో రాయలసీమలో అత్యధిక ప్రాధాన్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికే వైఎస్ జగన్ ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కూడా సభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు వైఎస్ జగన్. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 

2014 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కీలక నేతను ఓడించి రికార్డు సృష్టించారు. మాజీకేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర అయ్యారు. 

మిథున్ రెడ్డి మాటే తన మాట అన్నట్లు వైఎస్ జగన్ వ్యవహరించారంటే పార్టీలో వైఎస్ జగన్ మదిలో మిథున్ రెడ్డికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇకపోతే తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు మిథున్ రెడ్డికి కూడా వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. 

అనంతపురం జిల్లా ఇంచార్జ్ గా పనిచేసిన మిథున్ రెడ్డి జగన్ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి కీలక బాధ్యతలు భుజాన వేసుకున్నారు మిథున్ రెడ్డి. 

తెలుగుదేశం, ఇతర పార్టీలకి చెందిన నేతలను, తటస్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకు వచ్చేందుకు మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ప్రచారం. ఈసారి కూడా మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. 

ఆయన గెలుపు దాదాపు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డికి మంచి అవకాశం కల్పిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వేలు చెప్తున్నట్లు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 పార్లమెంట్ సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి కనీసం రెండు నుంచి మూడు కేంద్రమంత్రి పదవులను లాక్కోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు. 

అలా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి మంత్రి పదవులను కొట్టే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. రెండు లేదా మూడు మంత్రి పదవులను దక్కించుకుంటే కచ్చితంగా మిథున్ రెడ్డికి మెుదటి ప్రాధాన్యత ఇస్తారని టాక్. 

మరోవైపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమని జోరుగా చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అవకాశం కల్పిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

మెుత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఆఫర్ ఒకవేళ కేంద్రంలో అధికార పార్టీకి మద్దతిస్తే ఆఫర్ పొందే అవకాశం ఉంది పెద్దిరెడ్డి కుటుంబానికి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి వ్యూహాలు రచించడం వరకు వారే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. 

ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కీ రోల్ పోషించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతోపాటు వైసీపీ శ్రేణులో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.