హైదరాబాద్: ఎబీ వెంకటేశ్వర రావు రాసిచ్చిన స్క్రిప్టును వంగవీటి రాధా తన మీడియా సమావేశంలో చదివారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. తమ పార్టీపై, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వంగవీటి రాధా చేసిన విమర్శలను ఆయన గురువారం మీడియా సమావేశంలో కొట్టిపారేశారు. 

వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీలోకి రాధా వెళ్తున్నారని పెద్దిరెడ్డి అంటూ కాపులకు రాధా ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రంగా విగ్రహావిష్కరణకు వెళ్లవద్దని తాను గానీ జగన్ గానీ రాధాకు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాధాపై పార్టీలో ఏ విధమైన ఆంక్షలు కూడా పెట్టలేదని అన్నారు. 

తెలుగుదేశం పార్టీలో చేరడానికి రాధా తమపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాధా గెలవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, అందుకే విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని రాధాకు తానూ జగన్ సూచించామని ఆయన వివరించారు. కాపులు, రంగా అభిమానులు వైసిపితోనే ఉన్నారని అన్నారు.