హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వలసలపై క్లారిటీ ఇచ్చేశారు బీజేపీ చీఫ్ అమిత్ షా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలంటే సీనియర్ రాజకీయ వేత్తలు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందని గట్టి నమ్మకం తనకు ఉందన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్ లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ బీజేపీ అధికార విపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఊడ్చేపనిలో పడింది. జనసేన నేతలకు సైతం గాలం వేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడింది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు రేపింది బీజేపీ. 

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలంటే బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేయడంతో వలసలపై రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఏ పార్టీని ఈసారి బీజేపీ టార్గెట్ చేస్తోందా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

13. త్వరలో చినరాజప్పపై వేటు, నేనే ఎమ్మెల్యే : వైసీపీ అభ్యర్థి తోట వాణి ఆశలు

కాకినాడ : పెద్దాపురం నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట వాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పపై వేటు పడటం ఖాయమని ఆ తర్వాత తానే ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే చినరాజప్ప గెలుపై శనివారం హైకోర్టును ఆశ్రయించారు తోట వాణి. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసులు, ఆదాయ వనరులు దాచిపెట్టి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చినరాజప్పపై అనర్హత వేటు వేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. 

2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో చినరాజప్ప 15వ ముద్దాయి అని వైసీపీ అభ్యర్థి తోట వాణి స్పష్టం చేశారు. దాడి కేసును మూసివేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని 2016, 2018లలో రెండు జీవోలు విడుదల చేసి కోర్టుకు పంపిచినట్లు తెలిపారు. 

అయితే సాంకేతిక కారణాల వల్ల కోర్టు కేసు కొట్టివేతను తిరస్కరించిందని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసుల అంశాన్ని అఫిడవిట్ లో చినరాజప్ప ప్రకటించలేదని వాణి ఆరోపించారు.  

ఎమ్మెల్సీ పెన్షన్, ఆపద్ధర్మ డిప్యూటీ సీయంగా పొందుతున్న జీత భత్యాలను దాచిపెట్టి తనకు కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని చినరాజప్ప పొందుపరచడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆమె ఆరోపించారు. 

రాబోయే ఆరు నెలల్లో హైకోర్టు చినరాజప్పపై అనర్హత వేటు వేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తానే పెద్దాపురం ఎమ్మెల్యే అవుతానని తోట వాణి ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చినరాజప్ప, వైసీపీ అభ్యర్థిగా తోట వాణి పోటీ చేశారు. 

ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోట వాణిపై చినరాజప్ప 4 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే చినరాజప్ప గెలుపు చెల్లదని వాణి హైకోర్టును ఆశ్రయించారు. వాణి అనర్హత పిటీషన్ పై చినరాజప్ప, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.