విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న జగన్  తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా బాధితులను పరామర్శించడం కనీస బాధ్యతన్న విషయం కూడా తెలియదా అని నిలదీశారు.

తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందకపోయినా జగన్‌ మాటవరుసకైనా ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బీజేపీని విమర్శిస్తే జగన్‌ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

అగ్రిగోల్డ్‌ అంశంలో న్యాయం చేయాల్సిన వాళ్లే న్యాయం కావాలని అడుగుతున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు చేస్తున్న దీక్షలు దొంగదీక్షలని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో కీలకపాత్ర పోషిస్తామంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజల దృష్టిలో బీజేపీ విలన్‌ అయిందని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.